ఆది శంకరుల జ్ఞానప్రచారం
ఆదిశంకరులు సన్యాసాశ్రమం స్వీకరించడానికి ముందు బ్రహ్మచర్యాశ్రమంలో భిక్షాన్నముతోడనే జీవించేవారు. ఆరోజులలో ఒక ద్వాదశినాడు వారు భిక్షాటనం చేస్తూ 'భవతి భిక్షాం దేహి!' అంటూ ఒక దరిద్రుని యింట అడుగు పెట్టేరు. ఆయన వారిని అనుగ్రహించాలన్న ఊహతోడనే అలా వారి యింటికి వెళ్ళేరు. ఆగృహస్థు పరమదరిద్రుడు. ఉంఛవృత్తితో కాలం గడుపుతూ ఉండేవాడు. ఆచార్యులవారు వెళ్ళిన వేళకు ఆబ్రాహ్మణుడు ఇంటిలో లేడు. ఆయన భార్య మాత్రం ఉన్నది. మహాతేజస్సంపన్నులైన ఆచార్యులవారిని చూడగానే ఈ తేజస్వికి భిక్షపెడితే మేలు కలుగుతుంది, అని ఆమె అనుకొన్నది. ఆచార్యులవారిని చూచీ చూడడంతోటే అందరకూ ఒక గౌరవభావం ఆయనపై ఏర్పడేది. ఆ బ్రాహ్మణుని భార్య భిక్షవేయడానికి ఇంటిలో ఏముంది? అని వెదుక సాగింది. ఇంటిలో ఏమీ లేదు. ద్వాదశిపారాణానికై ఆ బ్రాహ్మణుడు ఒక ఉసిరికాయను సంపాదించి ఉంచుకొన్నాడు. అది కూడా చెడిపోయింది. ఈ బ్రహ్మచారికి ఈ ఉసిరికాయ భిక్షగా ఎట్లు వేయను? అని ఆమె సంకోచిస్తోంది.
కాని ఆచార్యులవారు ఆమె భక్తిని గ్రహించి ఆ ఉసిరికను గ్రహించేరు. అపుడు వారి దారిద్య్రాన్ని పోగొట్టుమని లక్ష్మీదేవిని ఉద్దేశించి 'కనకధారాస్తవం' అనే ఒక స్తవాన్ని చదివేరు. వారికి ఐశ్వర్యం ప్రసాదింపుమంటూ లక్ష్మీదేవిని వేడుకొన్నారు.
అప్పుడొక ఆశరీరవాణి-'వీరు చేసిన పాపం చాలా ఉంది; చాలాకాలం వీరు దరిద్రులుగా బాధపడాలి, అలా కాకుంటే వీరి పాపం తొలగదు' అని వినిపించింది.
అంతట ఆచార్యులవారు - 'వీరీవిధంగా పరమప్రీతితో భిక్షం పెట్టినారుకదా! దీనివలన సంపాదితమైన పుణ్యం ఎంత అధికమైన పాపాన్ని అయినా పరిహరింపజాలి ఉంటుంది'- అన్నారు. వెంటనే ఆ దరిద్రబ్రాహ్మణుని యిల్లు సకల సంపదలకు ఆలవాలమై ఐశ్వర్యంతో నిండింది. ఇది ఆచార్యులవారు బ్రాహ్మచర్యాశ్రమంలో ఉండగా జరిగిన విషయం.
తల్లిని వదలి ఆచార్యులవారు సక్రమంగా సన్యాసం స్వీకరించడానికై గురువును అన్వేషిస్తూ బయలుదేరేరు. ఈశ్వరావతారమైన ఆచార్యమూర్తికి వేరొక గురువు అవసరం కాకపోయినా లోకంలో సంప్రదాయాన్ని నిబంధించడానికై వారు అట్లు చేయవలసి వచ్చింది. స్వయంగా శంకరులే గురువును ఆశ్రయింపకపోతే లోకంలోని ఇతరులు గురువును ఆశ్రయించే సంప్రదాయం లోపించవచ్చును. అందుచే వారు గురువును వెదుకుతూ బయలుదేరేరు. వారు నర్మదాతీరంలో గురువును కలసికొన్నట్లు గ్రంథాలలోను కనిపిస్తొంది.
ఆచార్యులవారు శ్రీ గోవిందభగవత్పాదుల సన్నిధిలో సక్రమంగా సన్యాసం స్వీకరించేరు. శ్రీ గోవిందభగవత్పాదులవారు బ్రహ్మసూత్రాలకు భాష్యం వ్రాయవలసినదిగా శంకరులను ఆజ్ఞాపించేరు. పిమ్మట ఆచార్యులవారు అచటనుండి వారణాసికి బయలుదేరేరు. అక్కడనే వారు భాష్యరచనకు ఉపక్రమించేరు. వారు కాశిలో మణికర్ణికాఘట్టంలో ముక్తి మంటపంలో నివసిస్తూ శిష్యులకు ఉపదేశం చేస్తూ ఉండేవారు.
కాశి ఒక మహాక్షేత్రం. అక్కడ దేహత్యాగం చేసిన ప్రతి ప్రాణికి విశ్వేశ్వరుడు జ్ఞానోపదేశం చేసి ముక్తిని ప్రసాదిస్తాడు, ఇది ఆక్షేత్రంయొక్క విశేషం, కాశీక్షేత్రానికి వేరొక విశేషం కూడా ఉంది. మనదేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి. అన్నిమతాల ప్రతినిధులూ కాశీలో ఉండేవారు. ఆ కాలంలో కాశి అంటే పండితులుండే పట్టణం. యాత్రకై ఎందరో పండితులు అచటకు వచ్చి కొంతకాలం ఉండిపోతూ ఉండేవారు. మన దేశంలో ఎన్ని జాతులు ఎన్ని మతములు, ఎన్ని భాషలు ఉన్నాయో, అన్నీ అక్కడ కనిపిస్తాయి. అందుచే ఏ విషయమైనా కాశిలో ప్రచారంచేస్తే లోకంలో అంతటా ప్రచారం చేసినట్లు అవుతుంది. ఆచార్యులు కాశిలో భాష్యం రచించడానికి ఇదికూడా ఒక హేతువు. దినదినము దేశ##దేశములనుండి వచ్చిన వేదపండితులు కొంత కొంత ఆలకించుచుండగా ఆచార్యులవా రొనరించిన భాష్యరచన లోకంలో అనతికాలంలో ప్రశస్తి వహించింది. ఆచార్యులవారు తమరచనలో కొన్ని మతముల సిద్ధాంతాలను నిరాకరించేరు, ఔపనిషదమైన మతాన్ని స్థాపించేరు.
ఒకనాడు వ్యాసమహరి స్వయంగా ఆచార్యులవారిని అనుగ్రహించాలనుకొన్నారు. ఈశ్వరావతారమైన శంకరులకు ఉపదేశం చేయవలసినదిగా శ్రీ గోవిందభగత్పాదులవారికి ఆజ్ఞాపించినవారు వ్యాసులే. వారు శంకరభాష్యము లోకోపకారకమైన మహాగ్రంథమని లోకం గ్రహించేలా చెయ్యాలనుకొన్నారు. శంకరభాష్యం ప్రశస్తమైన దని నలుగురూ తొలిసికోవాలంటే, దానిపై కొన్ని ఆక్షేపాలు లేవదీయాలి, శంకరులు వానికి అన్నిటికి సమాధానాలు చెప్పాలి; అప్పుడే దాని ప్రశస్తి లోకానికి వెల్లడి అవుతుంది. అందుచే వ్యాసులు ఒకనాడు వృద్ధ బ్రాహ్మణ వేషంలో ఆచార్యులవారి వద్దకు వచ్చి వారి భాష్యరచనపై ప్రచండమైన వాదం లేవనెత్తేరు. వ్యాసులవారి ఆక్షేపణలకు ఆచార్యులవారు సమాధానాలు చెపుతున్నారు. వ్యాసులవారు ఆచార్యులవారి సమాధానాలలోని సూక్ష్మాంశాలను తిరిగి ఆక్షేపిస్తున్నారు. ఆచార్యులవారు వానికి యుక్తియుక్తంగా సమాధానాలు చెపుతున్నారు. ఇలా జరిగే వాదప్రతివాదాలు పరమ సూక్ష్మాంశాలపై సాగుతూ అన్యులకు అర్థంకాని క్లిష్టస్థితికి చేరుకొన్నాయి. ఈ వాదప్రతివాదాలు చూచి ప్రక్కనున్న శిష్యులు, ఇతరులు కూడా ఒకరి మొగాలు ఒకరు చూచుకొనసాగేరు. వృద్ధబ్రాహ్మణరూపంలో ఉన్న వ్యాసుని వాదం పొంగిన గంగలా పరుగెడుతూ ఉంటే ఆచార్యులవారి ప్రతివాదం సాగరగంభీరమై అలరారుతోంది. అపుడు ఆచార్యుల శిష్యులైన పద్మపాదులవారు 'ఉద్దండవాదన కొనసాగించే యీ వృద్దబ్రాహ్మణుడెవరై ఉంటాడు?' అని జ్ఞానదృష్టితో పరింకించి, 'ఈ వచ్చినవాడు వ్యాసుడు' అని గ్రహించేరు, వెంటనే వారు -
'శంకర శ్శంకర స్సాక్షాత్ వ్యాసో నారాయణ స్స్వయం|
తయో ర్వివాదే సంప్రాప్తే కింకరః కింకరో మ్యహం||'
శంకరులు శంకరావతారము, వ్యాసులు నారాయణావతారము అయినవారు. వారు వాదిస్తూ ఉంటే కింకరుడైన నేనేమి చేయగలను? అని పలికి, వాస్తవముగా ఈ భాష్యము మీహృదయములోని అభిప్రాయలనే అనుసరిస్తూ ఉంటే మీరు నిజరూపం ధరించాలి' అని వ్యాసులవారిని ఆర్థించేరు. తత్‌క్షణమే వ్యాసులు నిజరూపం ధరించేరు.
అపుడు శంకరులు - నేను వచ్చిన పని పూర్తి అయింది, పదునారేడులు నిండినవి, ఇక నేను పోవాలి, అనుగ్రహించండి' - అని వ్యాసులతో పలికేరు. దానికి వ్యాసులవారు నేను మరియొక పదునారేడ్లు అనుగ్రహించుచున్నాను; భాష్యరచన మాత్రము చాలదు, దానిలోని సిద్ధాంతములను పలుదేశాలలో ప్రచారం చెయ్యాలి, కొందరు ఏవో ఆక్షేపణలు లేవదీస్తారు, వానికి సమాధానాలు చెప్పాలి; భాష్యవిషయాలను సిద్ధాంతీకరించాలి' - అన్నారు. శంకరులు దానికి అంగీకరించేరు. వ్యాసుల కోరికను తీర్చుటకై వారు దిగ్విజయం గావించేరు.
శంకరులు కాశీనగరంలో ఉన్న సమయంలో వారిని ఆశ్రయించి శిష్యులైనవారిలో పద్మపాదాచార్యులవారు ఒకరు. వారికి ఈ పేరు ఏర్పడడానికి కారణమైన కథ ఒకటి ఉన్నది.
ఒక నాడు పద్మపాదులవారు గంగ కావలి యొడ్డు, శంకరులు గంగ కీవలియొడ్డున ఉన్నారు. ఆ సమయంలో శంకరులు గంగలో స్నానం చేసేరు. వారి బట్టలు తడిసి ఉన్నాయి. వారు ధరించవలసిన పొడిబట్టలు ఆవలి యొడ్డున పద్మపాదులదగ్గర ఉన్నాయి. శంకరులు పద్మపాదుల గురుభక్తిని లోకానికి చాటదలచి - 'ఆ వస్త్రములు తీసికొని రమ్మని' - ఆజ్ఞాపించేరు. పద్మపాదులకు గురువు ఆజ్ఞవినగానే గంగ విషయము, దాని లోతు, వేగము అన్నీ మరచిపోయేరు. ఆయన వస్త్రములు చేతబట్టుకొని నేలమీద నడచినటులే గంగలోకూడా నడవసాగేరు. అప్పుడు గంగ వారి పాదాలక్రింద పద్మాలను వికసంపజేస్తూ వచ్చింది. అనగా వారి పాదాలు గంగమీదకాక గంగలో మొలచిన పద్మాలపై ఆనుతూ వచ్చేయి. ఈ విధంగా వారు గంగను దాటి గురువును సమీపించేరు. ఇది చూచిన వారంతా వారి గురుభక్తిని కొనియాడేరు. ఆ నాటినుండియు పద్మములచే భరింపబడిన పాదాలుకలవారైనందున వారికి 'పద్మపాదులు' అని పేరు ఏర్పడ్డది.
గంగదాటి వచ్చిన పద్మపాదులను జూచి - 'మీరుగంగను ఎలా దాటినారు?' - అని ప్రశ్నించగా వారు - ఏ ఆచార్యులు స్మరిస్తే సంసారసాగరమే మోకాటిబంటిగా మారుతూ ఉందో, ఆ ఆచార్యుల ఆజ్ఞాపాలనంలో గంగ అడ్డంకి కాలేదంటే ఆశ్చర్యమెందుకు? అని బదుదు పలికిరట.
పద్మపాదులవారి పూర్వవృత్తాంతంకూడా చాలా ప్రసిద్దమైనది. వారు చోళ##దేశంలో జన్మించేరు. బాల్యంలో పెద్దలొకరు వారికి నరసింహ మంత్రం ఉపదేశించేరు. పద్మపాదులవారికి ఆ మంత్రం చక్కగా జపించి నృసింహస్వామిని దర్శించాలని కోరిక పుట్టింది. జపం చేయడానికి ఏకాంతం అవసరం. అందుకై వారు ఒక అడవికి వెళ్ళి జపానికి ఉపక్రమించేరు. ఆ అడవిలో ఉండే కిరాతుడొకడు వీరిని చూచి - ఎవరీయన? చూస్తే బ్రాహ్మణుడులా కనబడుతున్నాడు; ఇక్కడకు ఎందుకు వచ్చి ఉంటారు?' అని ఆలోచిస్తూ పద్మపాదుల దగ్గిరకు వచ్చి యిలా అన్నాడు - 'స్వామీ! ఇది వాసయోగ్యమైన తావు కాదు, అడవిజంతువులు క్రూరంగా ఉంటవి, మేమేదో వాటిని వేటాడి ఇక్కడ బ్రతుకుతూ ఉంటాం. మీవంటివారు రాదగినతావా ఇది? ఇంత దవ్వు మీరెందుకు వచ్చేరు?'
వాని యీ ప్రశ్నలు విని పద్మపాదులు - 'యథార్థం చెప్పినా వానికి తెలియదు'. 'నేను నృసింహస్వామి దర్శనంకోసం తపం చేయడానికి వచ్చేను' అని చెపితే మాత్రం అటవికూడైన వీడికి తెలుస్తుందా! తెలియదు' అని అనుకొని వానితో - 'నేను నరసింహాన్ని చూడడానికి వచ్చేను, ఇట్టి తావులందది లభిస్తుంది' అన్నారు.
అది విని వాడు - 'ఏమన్నారు స్వామీ? నరసింహమా! ఈ అడవిలో సింహాలున్నాయి, పులులున్నాయి, కాని నరసింహం నేను చూచినదికాదే! అసలా నరసింహం ఎలా ఉంటుందో చెప్పు స్వామీ! అన్నాడు ఆసక్తిగా.
అపుడు పద్మపాదులవారు 'సింగపుతలతో మానిసిమేనుతో నరసింహం ఉంటుంది' అన్నారు. వాడు వివరంగా చెప్పుస్వామీ! అని ప్రాధేయ పడ్డాడు. పద్మపాదులవారు వాని అమాయికతకు నవ్వుకొని నృసింహస్వామి యొక్క ఆకృతి వానికి తెలిసేటట్లు వివరించేరు.
అంతా విని వాడు - మీరు చెప్పేది నిజమేనా? ఆ నరసింహం ఈ కానలో ఉందా? నిజంగా ఉందా? అని ఆశ్చర్యం వెలిబుచ్చేడు.
దానికి పద్మపాదులు - అవును, నిజంగా ఉన్నదంటూ తల ఊపేరు.
'ఈ అడవిలో అంగుళం అంగుళం నాకు ఎఱికే, ఇచ్చటి మెకాలలో నేను చూడనిది లేదు; ఈ చుట్టుపట్టుల నన్ను మించి తెలిసిన అడవివాడు లేడు నిజంగా నరసింహం యిక్కడ ఉంటే మీరు కష్టపడ నక్కరలేదు. మెకాన్ని ఎలా పట్టాలో మీకేటెరుక? నేను దాన్ని పడతాను, పట్టి మీకు చూపిస్తాను' అన్నాడా బోయవాడు.
అది విని పద్మపాదులవారు నవ్వి ఊరకొన్నారు. వారి నవ్వుచూచి ఆ బోయవాడు - సామీ! నవ్వుతారేం? నేను దానిని తీసికొనిరాలేననుకంటున్నారా! నరసింహం ఇక్కడ ఉండడం నిక్కమైతే నేను దానిని తీసికొనిరావడం ఖాయం అన్నాడు. అది విని వారు - 'నరసింహం ఇక్కడున్నదన్న మాట నిజమే, కాని దానిని వెదకి కనుగొనడం నీకు సాధ్యం కాదు' అన్నాడు.
దానికి బోయవాడు పట్టుదలతో - ఏమన్నారు సామీ! నాకు సాధ్యం కాదనా? ఎంతమాటన్నారు? రేపు ప్రొద్దు క్రుంకే లోగా నరసింహాన్ని కనుక్కొని పట్టి తెస్తాను. అలా తీసుకొని రాకపోతే నాదీ కొక బ్రతుకేనా? ప్రాణాలు విడిచి పెడతాను. మీరు ఇంత కష్టపడి దానికై యింత దవ్వ వచ్చినారు కదా! నేను బోయవాడను, నాకు సాధ్యం కాదా!' అన్నాడు తీవ్రంగా.
అలా పలికి ఆ ఆటవికుడు నరసింహాన్ని వెదకడానికి బయలుదేరేడు. అడవి అంతా గాలించడం ప్రారంభించేడు, పొదలు, గుట్టలు, పుట్టలు అన్నీ వెదుకుతున్నాడు. వాని యీ అన్వేషణలో నృసింహుని మూర్తి చెరగకుండా వాని మనసుమీద ముద్రితమైంది. ఎడతెగని అన్వేషణలో నృసింహుని గూర్చిన ధ్యానం కూడా ఎడతెంపులేనిదై ఒప్పింది. వానికి అన్నం తినాలని, నీరు ద్రావాలనీ కూడా అనిపించలేదు. వాడు వెదకుతున్నాడు. అడవిలో అన్నిచోటులా అనన్యమైన మానసంతో అన్వేషణ కొనసాగిస్తున్నాడు. ఇలా ఆరోజు గడిచింది. మరునాడు కూడా వాడు తీవ్రంగా అన్వేషించేడు. ఏకాగ్రమైన మానసంతో ఇక్కడ ఉందేమో అక్కడ ఉన్నదేమో అని వెదుకుతూనే ఉన్నాడు. కాని ఎక్కడా 'నరసింహం' అతడికి కనబడలేదు. ఇంతలో ప్రొద్దు క్రుంకింది.
అప్పుడు వాడు - ఆ బ్రాహ్మణుడు అసత్యం చెప్పిఉండడు. నాకు నరసింహం కనిపించలేదు, సూర్యుడు అస్తమించేలోగా తీసుకొని వస్తాను. లేకపోతే ప్రాణం విడుస్తాను - అన్నానుకదా!, ఆడి తప్పకూడదు. అనుకొని వాడు కొన్ని తీగలను త్రాడుగా పేనేడు. దానిని ఒకచెట్టు కొమ్మకు వ్రేలాడదీసేడు ఉరి పోసుకొందామని.
నృసింహస్వామి ఈ ఆటవికుని ఆమాయికమైన ఏకాగ్రతకు ప్రసన్నులయ్యేరు. ఆయన ఆ బోయకు సాక్షాత్కరించాలనుకున్నారు. బోయవాడు ఉరిపోసుకొందామనుకొంటున్నాడు. అంతలోనే వానికి ఎదురుగా ఒక మృగం కన్పించింది. వాడు దానిని పరకించేడు. ఆ బ్రాహ్మణుడు చప్పేడు కదా! 'సింగపుతల, మానిసిమేను' అని సరిగా అలాగే ఉంది ఆ రూపం. దానిని చూచి బోయ చాలా ఆనందించాడు.
వాడు చెట్టుకొమ్మకు కట్టిన ఉరిత్రాడు విప్పుతూ - 'పాడు మెకమా! ఎంత బాధపెట్టేవు? నీ కోసం చావడానికి కూడా సిద్దపడ్డాను. ఇంక ఎక్కడకు పోతావు - అంటూ ఆ త్రాటిని దాని మెడకు తగిలించి బరబరలాగి పద్మపాదుల దగ్గరకు తీసుకొని వచ్చేడు.
పద్మపాదులవారు వస్తూఉన్న బోయవానివంక ఆసక్తిగా చూస్తున్నారు. వాడు వచ్చి - ఏం సామీ! నరసింహాన్ని పట్టలేనన్నారు, పట్టేనే లేదా? చూడండి మీరు చెప్పినట్లు సింగపుతల, మానిసిమేను - అన్నాడు.
కాని పద్మపాదులకు ఏమీ కనబడలేదు. వాని చేతిలోని త్రాడుమాత్రం కనబడుతూ ఉంది. వారు ఆశ్చర్యంగా చూస్తున్నారు.
అపుడు బోయవాడు - 'అయ్యా! ఈ నరసింహం కోసమే కదా మీరింత దవ్వు వచ్చేరు. ఇదుగో! తీసుకొనండి ఇక సుఖంగా ఇంటి వెళ్లండి' - అన్నాడు.
అపుడు పద్మపాదులవారికి వాని మాటలు యదార్థము లని, స్వామి వానికి దర్శనం యిచ్చేరని, తనకుమాత్రం కానరావడం లేదని నిశ్చయం కలిగింది. దానితో వారు కన్నీరుకారుస్తూ - 'స్వామీ! నేను నిన్ను దర్శించగోరి యిక్కడకు వచ్చేను. నీవు ఈ పామరునకు నీ దర్శనం అనుగ్రహంచేవు. నాకేల కానరావు?' అని వాపోయేరు.
అపుడు వారికి అశరీరవాక్కు ఇలా వినిపించింది. 'కోటి సంవత్సరాలు స్వరూపధ్యానం చేసినా అలవడని ఏకాగ్రత ఒక్కరోజులో వీనికి అలవడింది. ప్రాణాలు పణంగా పెట్టి యోగులకును లభ్యంకాని ఏకాగ్రచిత్తంతో వీడు నన్ను అన్వేషించేడు. ఇంతటి మహాభక్తుడైన ఈ కిరాతకునితోడి సాంగత్యం అనే భాగ్యం నీకు కలిగింది. అందుచేతనే నారూపం చూడజాలకపోయినా, నాపలుకులు నీవు వినగలుచున్నావు. సరే! నీకు మంత్రసిద్ది కలిగింది. నీకు అవసరమైనపుడు నేను నీ దగ్గరకు వస్తాను' - అని అశరీరవాణి వినిపించింది.
ఈ సంఘటన జరిగిన తరువాతనే పద్మపాదులవారు ఆచార్యులవారియొద్దకు వచ్చి వారికి శిష్యులయ్యేరు.
ఆచార్యులవారి దగ్గరకు ఒకనాడు ఒక కాపాలికుడు వచ్చేడు. కాపాలికులు కపాలాన్ని ఎముకల పేరును ధరిస్తారు. వారు శ్మశానంలో నివసిస్తారు. మజ్జ, మాంసం ఆరగిస్తారు. వారిది వామాచారానికి చెందిన ఉపాసనా పద్ధతి. వామాచారానికి చెందిన కాపాలికమతానికి ఇవన్నీ అవసరం. శంకరులు వామాచారాన్ని ఖండించేరు, వారి ఖండనకు కాపాలికులు బదులు చెప్పలేకపోయేరు. అలా నిరుత్తరులైకూడా వారు తమ ఉపాసనావిధానంమీదగల అభిమానం విడువలేకపోయేరు. కాని శంకరులు ఖండనం ముందు వారు నిలువలేకున్నారు కదా! అందుచే వారు శంకరులనే లోకంనుండి తొలగిస్తే బాధ ఉండదు అనే నిర్ణయానికి వచ్చేరు. అలా చేయడానికై వారొక పన్ను గడ పన్నేరు. దాని ఫలితంగానే వారొక కాపాలికుని శంకరుల వద్దకు పంపేరు.
శంకరులు ఏకాంతంగా ఉన్న సమయంలో ఆ కాపాలికుడు వారికి దర్శించి - స్వామీ! నేను కపాలిని ఉపాసిస్తున్నాను. కపాలిని సాక్షాత్కరింప జేసుకొనడానికై ఎన్నో బలులు ఇచ్చి ఉన్నాను. అయినా స్వామి ప్రత్యక్షం కాలేదు. పట్టాభిషిక్తుడైన మహారాజును, లేదా అష్టసిద్ధులు గడించుకొన్న ఆత్మజ్ఞానిని బలియిస్తే కపాలి తప్పక ప్రసన్నుడు అవుతాడు. కపాలిని ప్రసన్నుని గావించుకొనవలె నన్నది నాకుగల తీవ్రమైనకోర్కె. దీనికై ఏ మహారాజు దగ్గరకైనా పోయి వెల్లడిస్తే నా తల తీసిస్తాడే కాని నా కోరికకై తన తల నీయడు. మీరు కరుణాసాగరులు, అష్టసిద్ధులు మిమ్ము వరించేయి. ఆత్మవేత్తలలో మీరు అగ్రగణ్యులు, నా మనోరథం మీ ద్వారా నెరవేరుతుందని మీ సన్నిధానానికి వచ్చేను' - అని పలికేడు.
ఆ కాపాలికుని పలుకులు విని ఆచార్యులవారు చాలా ఆనందించేరు. సర్వదా నిరుపయోగమైన దేహం కూడా ఒక ప్రయోజనాన్ని సాధించగలుగుతూ ఉన్నది కదా అని, వారు సంతోషించేరు. చివికి చివికి నేల గూలిన వృక్షము వంటచెరకుకు ఉపయోగించుచున్నది. మరణించిన జంతువుల కొమ్ములు సైతము ఉపయోగపడుచున్నవి. ఏనుగైనచో దాని దంతములు సున్నితమైన నగిషీతో కూడిన వస్తువులు చేయుటకుపయగించుచున్నవి. లేడి చర్మము అసనముగా ఉపయోగించుచున్నది. ఎందుకును కొరగానిది మానవదేహమొక్కటియే. అట్టి యీ దేహము పరార్థము ఉపయోగపడుటకంటె మేలే ముండును? అని ఆలోచించి వారు కాపాలికునితో 'ఓయీ! నేనే నీ కోర్కె తీర్చుట కంగీకరించుచున్నాను. కాని నీవీ విషయము నాశిష్యులకు తెలియనీయకుము. వారి కిది తెలిసినచో నీకేదైనా కష్టము కలిగిస్తారు. నేను ఏకాంతముగా కూర్చిండి ధ్యానము చేసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో నీ కార్యం నిర్వర్తించుకొనవచ్చును' - అని చెప్పేరు. కాపాలికుడు సంతోషించి వెళ్ళిపోయేడు.
ఒకనాడు ఆచార్యులవారు ఏకాంతంగా ఉన్నారు. శిష్యులంతా ఎవరి పనులమీద వారు ఉన్నారు. ఆచార్యులవద్ద ఒక్కరూ లేరు. ఇది తగిన సమయం అని కపాలికుడు వారిని సమీపించి ఆచార్యుల శిరస్సు ఖండించడానికై కత్తి నెత్తేడు. సరిగా ఆ సమయానికి పద్మపాదులవారు ఎక్కడనుండియో హఠాత్తుగా పరుగెత్తి వచ్చేరు. ఆచార్యులవారు ధ్యాన నిమీలిత నేత్రులై ఉన్నారు. హహ్హహ్హ అనే వికటాట్టహాసం వారికి వినిపించింది. వారు కనులు తెరిచి చూచే సరికి కపాలికుని శరీరం ఖండఖండాలుగా చీల్చబడి ఉన్నది. ప్రక్కనే పద్మపాదులు నిలువబడి ఉన్నారు.
ఏమిటిది? ఈ కాపాలికుని ఇలా ఎవరు చీల్చేరు? అని ఆచార్యులవారు పద్మపాదులను ప్రశ్నించేరు. అంత పద్మపాదులవారు - నాకేమీ తెలియాదు, నేను గంగాతీరంలో ఉన్నాను; అప్పుడే దేహం ఏదో పరాధీనం అయినట్లు తోచింది. ఇపుడు ప్రజ్ఞ వచ్చింది; నేనిక్కడకు ఎలా ఎప్పుడు వచ్చేనో, ఈ కాపాలికుని చీల్చినదెవరో నాకేమీ తెలియదు' అన్నారు.
'నీవు ఏ మంత్రమైనా ఉపదేశం పొందేవా?' అని శ్రీ శంకరులు వారిని ప్రశ్నించేరు. అపుడు పద్మపాదులవారు' నృసింహమంత్రం ఉపదేశం పొందేను, కాని ఆ స్వామి నన్ను మాయచేసి ఒక బోయవానికి దర్శనం ప్రసాదించేరు; అవసరమైన వేళ వస్తానని మాత్రం నాతో పలికేరు. ఈ సమయంలో వారే ఆవేశించినా రనిపిస్తోంది. అవును, వారు రావడానికి ఇంతకంటే ఉపయుక్తమైన సమయం ఏముంటుంది? అన్నారు.
గంగాతీరంలో ఉన్న పద్మపాదులవారికి నృసింహస్వామి ఆవేశించేరని, వారే యీ కాపాలికుని చీల్చివేసేరని, ధ్యానంలో ఉండగా తనకు వినిపించిన అట్టహాసం నృసింహస్వామిదేనని ఆచార్యులవారు గ్రహించేరు.
ఒకనాడు ఆచార్యులవారు గంగాస్నానానికి బయలుదేరారు. అపుడొక మాలవాడు ఎరిగి ఎరిగి అలాచేయాలనే ఉద్దేశ్యంతోనే వారికి దగ్గరగా వచ్చి వారికి ప్రక్కనే నిలువబడ్డాడు. ఆచార్యులవారు మాలావానిని దూరంగా తొలుగుమన్నారు. కాని వాడు తొలగక ఆచార్యులవారిని ప్రశ్నించనారంభించేడు.
అన్నమయా దన్నమయం, అధవాచై తన్యమేవ చైతన్యాత్|
ద్విజవరదూరీకర్తుం వాంఛసి కిం బ్రూహీ గచ్ఛ గచ్ఛేతి?||
- మనీషా పంచకం.
బ్రాహ్మణోత్తమా! దేనిని తొలగు మనుచున్నారు?
విప్రో2యం శ్వపచో2య మిత్యపి మహాన్‌కో2యం విభేదభ్రమః|
అంటూ ఆ మాలవాడు మీరు శిష్యులకు వేదాంతమే కదా బోధిస్తున్నారు! వేదాంతం - 'వాడు వేరు, వీడు వేరు' అని చెపుతూ ఉన్నదా? గీతలో భగవానులు -
విద్యా వినయంసంపన్నే బ్రాహ్మణ గవిహస్తిని|
శునిచైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః||
అని కదా చెప్పేరు. ఈ భేదభ్రాంతి మీకు ఎలా అలవడింది? మీరు 'అహం బ్రహ్మస్మి, శివో2హం' అని పలుకుతూ ఉంటారుకదా! వానికి అర్థం ఏమిటి? అని ఆ చండాలుడు ప్రశ్నించేడు.
బింబ ప్రతిబింబవాదము, అవిచ్ఛిన్నవాదము అని రెండు వాదములున్నవి. ఈ రెండును పరమాత్మకును మనకును భేదము లేదని నిరూపించును.
దోసెడు నీళ్ళు నేలపై చల్లేము. అపుడు అవి ఎన్నో జలకణాలై నేలమీద పడతాయి. ఆ జలకణాలు కొన్ని చిన్నవి కొన్ని పెద్దవిగా ఉంటాయి. ఆకాశంమీద సూర్యుడొక్కడే ఉన్నాడు. ఆ ఒక్క సూర్యుడూ ఈ చిన్న పెద్ద జలకణాలలో చిన్నవాడుగా పెద్దవాడుగా ప్రతిబింబిస్తూ ఉంటాడు. ఆ జలకణాలు నేలలో ఇంకిపోతే ప్రతిబింబాలున్నూ అంతరిస్తాయి. బింబం ఒక్కటే మిగులుతుంది. అలాగే పరమాత్మ అంతఃకరణోపాధులయందు ప్రతిబింబిస్తాడు. ఆ ఉపాధుల భేదాల ననుసరించి ప్రతిబింబభేదాలు ఉంటాయి. ఉపాధియైన అంతఃకరణం అనగా మనస్సు లేకపోతే యీ ప్రతిబింబం ఉండదు. బింబమైన పరమాత్మయే నిలిచి దీపిస్తాడు. మనస్సు ప్రవాహం వంటిది. ప్రవాహం అంటే సంతతమైన గమనం మనస్సు యొక్క యీ గమనాన్ని నిలిపితే మనస్సు ఉండదు. ప్రతిబింబం ఉండదు. బింబమైన పరమాత్మ అద్వయమై భాసిస్తుంది. ఇది బింబ ప్రతిబింబవాదం.
ఇక అవిచ్ఛిన్నవాదం. అది కూడా పైవిషయాన్నే నిరూపిస్తుంది కాని విధానం వేరు. బావిలో నీరున్నది. అందులో నుండి ఒక చెంబెడు నీరు తీసేము, చెంబులోని నీరు బావిలోని నీరు ఒక్కటే కాని ఉపాధిభేదం ఉన్నది. ఆకాశం అంతటా ఉన్నది. అంతటా ఉన్న ఆకాశాన్ని మహాకాశం అంటారు. ఘటంలోని ఆకాశాన్ని ఘటాకాశం అంటారు. ఘటం ఉన్నంతవరకు ఘటాకాశం మహాకాశం వేరువేరుగా కనిపిస్తాయి కాని ఘటం పగిలిపోగానే ఒక్కమహాకాశ##మే గోచరిస్తుంది. అలాగే ఉపాధిభేదాన్ని బట్టి అనగా మనసుయొక్క వ్యత్యసస్థతిని బట్టి పరమాత్మకూడా వ్యత్యాసంగా కనిపిస్తూ ఉంటాడు. ఘటం పగులగానే ఘటాకాశ మఠాకాశాలు ఒక్కటైనట్లు మనస్సు నశించగానే అద్వయమైన పరమాత్మ గోచరిస్తాడు. ఇది అవిచ్ఛిన్నవాదం.
ఈ రెండు వాదాలను బుద్ధియందుంచుకొనియే ఆ మాలవాడు ఆచార్యులవారితో తర్కానికి దిగేడు.
సూర్యుడు పవిత్రమమైన గంగయందుప్రకాశించినట్లే చండాలవాటికయందున్ను ప్రకాశిస్తున్నాడు. రెండు ప్రకాశాలకు తేడా ఉన్నదా! బంగారుబిందె, మట్టికడవ రెండింటిలోనూ ఆకాశం ఉన్నది, ఈ రెండు ఆకాశాలకు భేదం ఉన్నదా! లేదే!
అలాగే సర్వశరీరాలలోనూ ఒకే ఒకవస్తువు భాసిస్తోంది. ఆ వస్తువు ఆనందమయమైనది. అది పూర్ణమైనది. సముద్రమును పోలినది. వాస్తవానికి ఆ పరిపూర్ణవస్తువును సముద్రముతో పోల్చడం తగదు. ఏమంటే సముద్రం లేని చోటు చాలా ఉన్నది? కాని ఈ వస్తువు లేనిచోటు లేదు. మన ఎరికలో సముద్రాన్ని మించి పూర్ణమైన వస్తువు లేదు కనుక దానితో పోలుస్తున్నాము. ఆ మాలవాడు పేర్కొన్న వస్తువు ఆనందసముద్రము, ఙ్ఞాన సముద్రము అయినది. నిరవధికమైన ప్రేమతో, నిరవధికమైన చైతన్యముతో నిండినది, సముద్రము నందు తరంగాలు ఉన్నాయి. కాని ఆనందసముద్రము నిస్తరంగము, అందులో అలలు లేవు కారణం ఏమంటే - లోకంలోని సముద్రం విషయంలో దానికంటే భిన్నమైన దేశం ఉన్నది, అందుచే అందు అలలు పుట్టడానికి అవకాశం ఉంది. కాని యీ ఆనందమయ వస్తువు లేనిచోటులేదు. దీనికి వెలితిలేదు. ఇది అంతటా నిండి ఉన్నది. అందుచే ఇచ్చట అలలుపుట్టే అవకాశ##మే లేదు. ఇట్టి వస్తువులో వ్యత్యాసం ఏమిటి? అని మాలవాడు ఆచార్యులవారిని ప్రశ్నించేడు.
ఈ ప్రశ్నకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి సమాధానం చెప్పాలి అని మనం భావిస్తాం. కాని ప్రశ్న ఙ్ఞానవిధానంలో వేయబడింది. అందుచే ఆచార్యులవారు కూడా జ్ఞానవిధానంలోనే సమాధానం చెప్పేరు.
ఆచార్యులవారు అన్నారు కదా!- 'తాము ఇట్టివారా! బ్రాహ్మణుడైనా సరే చండాలుడైనా సరే అతడు బ్రహ్మవేత్త అయితే నాకు గురువే'- అన్నారు. మనంకూడా ఇటువంటి వారికి నమస్కరించడానికి సిద్దంగా ఉండాలి. అట్టి జ్ఞానస్థితిలో చండాలుడు చండాలుడుకాడు, బ్రాహ్మణుడు బ్రాహ్మణుడు కాడు, అని వేదం ఉద్ఘాటిస్తోంది. ఈ విషయాన్నే శ్రీ శంకరులు 'మనీషాపంచకం' అనే ఐదు శ్లోకాలలో వివరించేరు.
జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్థిరతరా యా సంవిదుజ్జృంభ##తే|
యాబ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షీణీ||
- మనీషా పంచకం.
'జాగ్రత్స్వప్న సుషుప్తులలో ఏ చైతన్యం మిక్కిలి స్ఫుటంగా ప్రకాశిస్తూ ఉన్నదో, ఏది చీమ మొదలు బ్రహ్మ వరకూగల సర్వశరీరాలలోనూ సాక్షిగా నెలకొని ఉన్నదో ఆ చైతన్యమే నేను కాని, ఈ దృశ్యమైన జడవస్తువు నేను కాను, అనే జ్ఞానం ఎవనియందు సుధృడమై భాసిస్తుందో వాడు చండాలుడైనాసరే ద్విజుడైనా సరే నాకు గురువు' - అనునదే పైశ్లోకం యొక్క తాత్పర్యం.
ఆ మాలవాడెవరు? కాశీనాథుడు విశ్వేశ్వరుడే. ఆచార్యులను పరిశోధించడానికి అలా వచ్చేరు. ఈ ఆచార్యుడు జ్ఞాన ప్రచారం చేస్తున్నాడే కాని తాను బోధించే విషయంలో అనుభవం ఉండి చెపుతున్నాడా లేక నోటిమాటగా చెపుతున్నాడా? పరిశీలిద్దామనే ఊహతో, ఆచార్యుల మహిమను వెల్లడించి లోకానికి శ్రేయం చేకూర్చాలన్న తలంపుతో అలా చేసేరు. తమ గొప్ప తామే చెప్పుకోకూడదు. అలా చెప్పుకొనడం లోపమే అవుతుంది. ఇతరులు చెప్పుకొంటే అది కీర్తి అవుతుంది. మహత్త్యం వెల్లడి అవుతుంది. అందుకే ఆచార్యుల మహిమను వెల్లడించే తలంపుతో కాశీవిశ్వనాథుడు కుహనాచండాల వేషం ధరించేడు.
ఇక్కడ ఆచార్యులవారు చెప్పిన శ్లోకభావాలను కొంత పరిశీలిద్దాం. ప్రపంచంలోని సమస్త ప్రాణులను ఆత్మభావంతో చూడడం ఏ విధంగా సాధ్యం? భేదజ్ఞానం ఎందుకు కలుగుతూ ఉన్నది? అభేదజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అన్న విషయాలు వారు ఆ శ్లోకాలలో వివరించేరు.
జాగ్రదవస్థ, స్వప్నావస్థ, సుషుష్త్యవస్థ - అని మూడు అవస్తలను మనం గమనిస్తున్నాం. మెలకువగా ఉండే అవస్థ జాగ్రదవస్థ. కలలు కనుట స్వప్నావస్థ. కలకూడా లేక మైమరచి నిద్రపోవుట సుషుష్త్యవస్థ. మైమరచి నిద్రించి వాడు, కలలు కన్నాడు, అందుండి మెలకువ పొందినవాడు ఒక్కడే. కాని కలలోని నడవడికి మెలకువగా ఉన్నవేళ నడవడికి సంబంధం ఉండదు. దానికదే దీనికిదే. అలా అని కల గాంచివాడు మెలకువ చెందినవాడు వేరు అనుకొనడం తగదు. అవస్థలు వేరైనపుడు మనోభావాలు వేరుగా ఉంటాయేకాని వ్యక్తి మారడు. అందుచే జాగ్రత్-స్వప్న-సుషుప్తులనే మూడు అవస్థలనూ గమనించే వాడు ఒక్కడే. అలాగే వేరు వేరు చోట్ల వేరువరు వ్యక్తులుగా వేర్వేరు మనోభావాలతో వేర్వేరు శారీరకక్రియలతో గోచరించేవాడుకూడా ఒక్కడే అన్న భావం కలగాలి.
ఉదాహరణకు మనం ఒకప్పుడు శాంతంగానూ, మరొకప్పుడు క్రోధంగానూ ఉంటూ ఉంటాము. శాంత-క్రోధావస్థలలో ఉన్నది ఒక్కరే కాని ఇద్దరు కాదుకదా! ఇది మనం ఎరిగిన విషయమే. దేహం వేరు మనస్సువేరు. శాంతాన్ని అనుసరించినప్పుడు శాంతావస్థను, క్రోధాన్ని అనుసరించి నపుడు క్రుద్ధస్థితిని పొందినటులే మనం దేహాన్ని అనుసరించి జాగ్రదవస్థను, మనస్సును అనుసరించి స్వప్నావస్థను గమనిస్తున్నాం. అవస్థలకు భేదాలున్నయేకాని ఆ అవస్థలో ఉండేవానికి భేదం లేదు. అవస్థాభేదాన్ని బట్టి విరుద్దకార్యాచరణం కూడా జరుగుతూ ఉంటుంది. మనం ఏ పనులు మెలకువగా ఉన్నపుడు ఎంతమాత్రమూ ఆచరించమో ఆ పనులలో కొన్ని అప్పుడప్పుడు కలలో మనచే ఆచరింపబడినట్లు గమనిస్తున్నాం. దీనికి కారణం ఏమిటి అవస్థాభేదం. ఇదొక అవస్థ. అదొక అవస్థ కావడం. కాగా జాగ్రత్-స్వప్న-సుషప్తులనే మూడవస్థలనూ గమనించేవాడు ఒక్కడే అన్నది నిశ్చితార్థం, విరుద్ద కార్యాచరణానికి హేతువైనది అవస్థాభేదం.
ఇట్లే భిన్న దేహాలు భిన్న మనస్సులు వానిని బట్టి భిన్న కార్యాలు, అనగా విరుద్ధకార్యాలు, ఈర్యాద్వేష స్నేహప్రేమ వాత్సల్యక్రోధ సంతోషాలను వెల్లడించే ఎన్నోరకాల పనులు - ఇలా విభిన్నతలు ఎన్నో ఉన్నప్పటికీ అన్నింటిని గమనించేవాడు ఒక్కడే అన్నది సారాంశం.
జాగ్రత్-స్వప్న-సుషుప్తులు అనే అవస్థల భేదాలను బట్టి క్రియాభేదం ఏర్పడినా ఆ మూడవస్థలను గమనించేవాడు ఒక్కడే అయినట్లు-లోకంలోని వేర్వేరుదేహాలు వేర్వేరుమనస్సులు కారణంగా వేర్వేరు కార్యాలు ఆచరింపబడుతూ ఉన్నట్లు తోచినప్పటికి-ఈ అన్ని చోటులందు ఒకే ఒక్క తత్త్వం ఒకేనేను అన్న వస్తువు భాసిస్తోందని గ్రహించాలి.
ఒక మనుష్యుడు పిచ్చివాడైనందున తాను వ్రాసిన పుస్తకాన్ని తానే చించుకొన్నాడు. అందంగా చక్కగా వ్రాసిన వాడే దానిని చించివేసినాడు కదా! ఎందుకిలా జరిగింది అవస్థాభేదం. అందుచే ఈ విధానాన్ని అనుసరించి మన పుస్తకాన్ని ఎవరో చింపినప్పటికి; ఉపాధిభేదంచే ఆ పని మనచేతనే చేయబడినట్లు ఎంచుకోవాలి. ఒకడెవడో మనలకు కొడితే వాడు మనలకు కొట్టేడు అనడం తప్పు, అవస్థాభేదమే కాని కొట్టినవాడు కొట్టబడినవాడు ఒక్కడే. అనగా మనలను మనమే కొట్టుకున్నాం. వాడు నన్ను కొట్టేడు అనడం లోకదృష్టితో చెప్పేమాట. కొట్టినది కొట్టబడినది ఒక్కడే అన్నది సత్యదృష్టి.
జగత్తును అంతను ఈ విధంగా ఆత్మదృష్టితో పరికించగలగాలి, అప్పుడు జగత్తు అంతా ఒక్క నేనుగా అనుభవానికి వచ్చి-అంతా నేనే, అంతటా నేనే, నాకంటే వేరేమీ లేదు అన్న జ్ఞానం భాసిస్తుంది.
ఇట్టి మహోన్నతజ్ఞానం కలవాడు చండాలుడైనా పండితుడే, ఆచార్యులవారు దీనినే మనీషాపంచకములోని వేరొక శ్లోకంలో ఇలా చెప్పేరు.
యత్సౌఖ్యాంబుధి లేశ##లేశత ఇమే శక్రాదయో నిర్వృతః
యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనే లబ్ద్వా ముని ర్నిర్వృతః|
యస్మిన్నిత్య సుధాంబుధౌ గలతధీ ర్ర్బహ్మైపన బ్రహ్మవిత్
యః కశ్చిత్ స సురేంద్రవందితపదో నూనం మనీషా మమ||
- మనీషా పంచకమ్.
చండాలుని దూరము తొలగుము తొలగుమని తరిమిన వారును, అనంతర మాతని జ్ఞానవైభవమును గాంచి ప్రణమిల్లిన వారును ఆచార్యులే. ఆచార్యుల యొక్క పైశ్లోకములో వేదములు, గీత దేనిని ప్రస్తుతించినవో ఆ మహావిషయమే ప్రస్తుతింపబడినది.
మొదట మిమ్ము గుర్తించలేదు, మీరట్టి బ్రహ్మవిదులైనచో మీరే ఆచార్యులు, మీకు నమస్కారములు అని ఆచార్యులు చండాలునికి నమస్కరించేరు.
సాధారణముగా ఎట్టివారికైనను కిట్టనివారితో వ్యవహరించునపుడు కోపం వస్తుంది. తమ్ము అనుసరించేవారిని చూస్తే ప్రీతి జనిస్తుంది. మనం బలిష్టులను చూచి భయపడతాము. విషజంతువైన సర్పవృశ్చికాలుకూడ మనకు భీతినే కలిగిస్తాయి. ఈ కోపము, ఈ భయము పోయి సర్వత్ర ప్రీతియే విరాజిల్లవలెనంటే ఏది సాధనం? 'అన్నియు మనమే, లోకంలోని అన్ని ఉపాధులలోను విరాజిల్లి ఉన్నది ఒక్కనేనే కాని అనేకము కాదు' - అన్న జ్ఞానం ఉదయించగానే క్రోధేర్యాభయద్వేషాలు ఇక పుట్టవు. అన్నిటియందు సర్వతప్రీతియే భాసిస్తుంది. తన్ను చూచుకొని తానే భయపడువాడు, తనపై తానే కోపించువాడు ఉండడుకదా! అందుచే వ్యస్తమైన సమస్తమూ మనమే అని తెలిసికొన్నప్పుడు ఏ భయమూ ఉండదు. అట్టి స్థితి సంపాదించడానికే ఎన్నోకట్టుబాట్లు ఏర్పడ్డాయి.
ఇంద్రియాలు మనకు ఆశాప్రేరకాలుగా ఉన్నాయి. కొన్ని ఆహారాలు మనకు మిక్కిలి రుచ్యంగా తోస్తాయి. కొన్ని వెగటుగా ఉంటాయి. ఈ వ్యత్యాసం జిహ్వేంద్రియం తెచ్చి పెట్టింది. వ్యత్యాసం తొలగి సమత్వం రావడానికే ఆహారం విషయంలో కట్టుబాటు, ఆ యింద్రియం యొక్క చాపల్యం అంతరించి దానియందు సమత్వం ఆవిర్భవించినమీదట కట్టుబాటుతో పనిలేదు. ఏమి తిన్నా నష్టంలేదు. అందుచే ఒక దానిపై ఇచ్ఛ మరొకదానిపై అనిచ్ఛ ఉన్నంతవరకు నిబంధనలకు నియమాలకు లోబడి ఉండం తప్పనిసరి. ఇంద్రియాలు కల్పనచేసే వ్యత్యాసం తొలగినమీదట నియమాలు తమంతతామే జారిపోతాయి.
శ్రీ శుకులవారు జన్మించగానే సన్యసించేరు, ఇల్లు విడచి వెళ్ళి పోయేరు. వారి తండ్రి వ్యాసులవారు. ఆయన పుత్రవాత్సల్యంతో కొడుకును వెంబడిచేరు. ఒకచోట స్త్రీలు స్నానం చేస్తున్నారు. వారు శుకుని చూచి సిగ్గుపడలేదుకాని వ్యాసులవారిని చూచి సిగ్గుపడ్డారు. వ్యాసులవారు బ్రహ్మసూత్రాలు రచించినా సుఖదుఃఖవ్యత్యాసం వారికి తొలగలేదు; సమత్వం పరిపూర్ణంగా వారియందు ఆవిర్భవించలేదు. శుకులు సమదర్శులైన యోగిపుంగవులు. అందుచేతనే ఆ స్త్రీలకు శుకులను చూచినపుడు లజ్జ ఉదయించలేదు. వ్యాసులను చూడగానే వారియందు లజ్జ ఉదయించింది. ఒక దానియందు ప్రత్యేకమైన మక్కువ ఉన్నంతవరకు సమత్వం ఏర్పడదు, వ్యత్యాసం అంతరించదు. వ్యత్యాసం ఉన్నంతవరకు మనం నియమాలను కట్టుబాట్లను పాలించాలి.
ఇలా జ్ఞానపథంలో ఆచార్యుల ఘనతకు చాటడానికై చండాలరూపంలో వచ్చి విశ్వేశ్వరుడు అడిగిన ప్రశ్నలకూ, తత్కాలంలో ఆచరణలో ఉన్న లోకవ్యవహారానికి సంబంధం ఏమీ లేదు. ఆచార్యులు అన్నిచోట్లా శాస్త్రరీత్యా ధర్మ కర్మానుష్ఠానపాలనం జరుగవలెననియే బోధించేరు అనుష్ఠానాలను వారు మర్చలేదు. కర్మానుష్ఠానాన్ని వారు ఒక్కనాడు కూడా విడిచిపెట్టలేదు. లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడానికై వారు అవతరించేరు. శాస్త్రవిధి, ధర్మానుష్ఠానం జ్ఞానానికి సాధనాలు అనియే వారు ఉపదేశించేరు.
ప్రతిజీవుడు క్రమంగా తరించడానికి సోపానములవలె అనుష్ఠానాలు ఏర్పడి ఉన్నాయి. ఈ అనుష్ఠానాలు అన్నీ జీవుడు ఉత్తమగతి పొందడానికి ఏర్పడ్డాయేకాని, - కేవలం ఐహికసౌఖ్యాన్ని సాధించడానికి ఏర్పడిఉన్నట్లు తోచదు. అనుష్ఠానాలలో కొన్ని క్రమాలు ఉన్నయి, అందరూ అన్ని కార్యాలూ ఆచరించలేరు, ఒక కార్యం ఒకరు, మరొక కార్యం మరియొకరు చెయుటలోనే మేలున్నది, పొదుపు ఉన్నది, సౌఖ్యం ఉన్నది, కృషికార్యాలకు ఒకడు, యుద్ధమునకు వేరొకడు, వ్యాపారానికి ఇంకొకడు, చదువుటకు మరియొకడు ఇలా భిన్నకార్యాలు భిన్నవ్యక్తులు చేయడమే మంచిది. ఇవన్నీ అవసరమైనవే. వీనిలో ఏది లేకపోయినా కష్టమే, కాని అందరం అన్ని పనులు చేయలేము. పరస్పర ప్రయోజనాలను ఉద్దేశించియే కర్మానుష్ఠానాలు ఉన్నాయి.
లోకంలో ఎన్నో పనులున్నాయి. వానిలో కొన్ని ఉత్తమకార్యాలు చేసేవారు కొన్ని కట్లుబాట్లను అనుసరించాలి. వారు మాంసం తినకూడదు. శాకాహారమే స్వీకరించాలి. నియమితదివసాలలో ఉపవాసం ఉండాలి. అయితే లోకంలో అందరూ ఈ విధంగా ఉండడం సాధ్యముకాదు. అందరూ ఉపవాసం ఉంటే 'ఫ్యాక్టరీ' లలో పనులెవరు చేస్తారు, చెట్లు నరకడం వంటి శ్రమకరమైన పనులు ఎలా సాధింపబడతాయి? ఇటువంటి పనులు చేయకపోతే లోకం ఎలా సాగుతుంది? ఇవన్నీ అవసరమైన పనులే. అందుచే ఉపవాస నియమం, శాకాహారనియమం అందరకు విధింపబడినవి కావు. అందరూ ఆ నియమాన్ని పాలించడం సాధ్యమూ కాదు.
మాంసాహారులైన వారిని ఎవరో పదిమంది మీరు మాంసం తినడానికి వీలులేదు అని నిర్భంధించినా, లేక ప్రభుత్వమే మాంసాహారాన్ని నిషేదిస్తూ ఒక చట్టమే చేసినా ప్రయోజనం ఏమీ ఉండదు. వారు మాంసాహారం విడిచిపెట్టలేరు. ఒకవేళ మాంసాహారులైన వారిలోనే కొందరు శాకాహారులుగా ఉండుటకు నిశ్చంచుకొన్నా ఆ నిశ్చయంలో దార్డ్యం ఉండదు. పదిసంవత్సరాలైనా గడవకుండా వారు మరల మాంసాహారులుగా మారవచ్చు లేదా వారి పుత్రులైనా విచ్ఛిన్నమైన మాంసాహారం తిరిగి తమయింట నెలకొల్పవచ్చు. అందుచే ఒక్కొక్క ఆచారం ఒక్కొక్క జాతిని ఉద్ధేశించి ఏర్పాటు చేయబడింది. అలా చేయడంవల్ల ఆచారపాలనానికి విచ్ఛిత్తి ఏర్పడే అవకాశం ఉండదు.
అనాదిగా మనదేశంలో కొన్ని జాతులు కేవలం శాకాహారులై ఉన్నారు. ఇట్టి ఆచారాలు లోకంలో ఉండాలి. దేశరక్షణకు సైనికుడు అవసరమైనట్లే దేశంలోని ప్రజల ఆత్మోన్నతికి సాత్వికవ్యక్తి అవసరం. సాత్వికతను నిలుపుకొనడానికి మాంసాహారం విడచిపెట్టాలి. అందుచేతనే ఇట్టి ఆచారాలు ఒక్కొక్కవిధంగా రూపొందింపబడ్డాయి. అన్ని ఆచారాలు వంశక్రమంగా పాలింపబడుతూ వచ్చేయి. అయితే వర్ణసాంకర్యం లేనప్పుడు మాత్రమే ఈ ఆచారాలు నిలుస్తాయి. వీని వలన ప్రయోజనాలు సంఘానికి లభిస్తాయి. కేవలం దేహంతోపాటు పడవలసినచోట బుద్ధివైభవం అనవసరం. బుద్ధితో కార్యసాధనం చేయవలసిన చోట దేహపాటవం అప్రధానమే అవుతుంది. శారీరికమైన కృషి, మానసికమైన శ్రమ రెండూ లోకానికి అవసరమే. ఇవి రెండూ పరమేశ్వరుని సేవాసాధనాలే. అయినా దేహం దేహమే మనసు మనస్సే. వేరైనా యీ రెంటిని కలపడానికి యత్నిస్తే రెండూ లోపిస్తాయి.
మనం ఉద్యోగం చేయడానికై కచేరీకి వెడతాము, భోజనానికి భోజనశాలకు, విద్యాభ్యాసానికై విద్యాలయానికి వెడతాము. ఈ అన్నింటినీ ఒక్కటిగా చేయడం సాధ్యమా! కాదు, దేని ప్రత్యేకత దానిది కదా!
కొన్నికొన్ని కార్యాలకు కొన్ని కొన్ని ప్రత్యేకమైన అధిక సౌకర్యాలు అవసరం అవుతూ ఉంటాయి. శ్రాద్ధం చేసే రోజున స్నానంచేసి శుచిగా ఉండాలి. అనుదినం స్నానం చేయవలసినదే. కాని అపుడపుడు వీలు చిక్కకపోవచ్చును. ఈనాడు జీవన వృత్తులవల్ల మనం సక్రమంగా కర్మానుష్ఠానం చేయడం సాధ్యం కావడం లేదు.
ఏదో ఒక పని చేసి కారణంగా ఒకడు అధికుడు, మరియొక రకమైన పనిచేస్తున్నాడు కనుక వాడెవడో అధముడు అనే భావం అర్హమైనది కాదు. ఆలోచిస్తే అందరూ సమిష్టిగా ఒకే కార్యాన్ని గూర్చి పాటుపడుతున్నారు. సంఘశ్రేయంతో కలిసిన ఆత్మాభ్యున్నతియే ఆ కార్యం, ఆ కార్యసాధనకు తగిన అనుష్ఠానాలకు క్రొత్తగా సృష్టించడంకంటే పరంపరాగతములైన అనుష్ఠానపాలనమే మేలైనది, శ్రేయోదాయకమైనది.
మన ఆచారాలు అనాదిగా ఏర్పడి ఉన్నాయి. పరదేశాలవారి ఆచారాలు మధ్యకాలంలో రూపొందేయి. వారిని చూచి మనం మన ఆచారాలను మార్చుకొనడంవల్ల సామాజిక జీవనంలో ఎన్నోక్లేశాలు తలయెత్తుతాయి. మనకు నచ్చిన పనులన్నీ చేయనారంభిస్తే మనం సాధించేది ఏమీ ఉండదు. కంచెలోని ఏకొంతభాగాన్ని తొలగించినా క్రమంగా కంచె పూర్తిగా నశించే సావకాశం ఉన్నది. ఒక నియమాన్ని మనం యీనాడు ఉల్లంఘిస్తే క్రమంగా నియమోల్లంఘన మే మనస్వభావం అయి కూర్చుంటుంది.
భారతీయులమైన మనలో ఎన్నో తెగలు ఉన్నాయి అంటారు. అవును సాంఘికశ్రేయంతోబాటు ఆత్మాభ్యున్నతిని సాధించాడానికి ఈ వర్ణాశ్రమాలు, ఈ ధర్మాలు ఉండాలి, భోజ్యాభోజ్యాలు, దృశ్యాదృశ్యాలు మొదలైన నియమాలుకూడా తప్పనివే. ఈ కట్టుబాట్లు అందరకు సుఖాన్ని ప్రసాదిస్తాయి.
విధినిషాధాలు అందరకూ ఉన్నాయి. అవి ఆత్మ శ్రేయాన్నేకాక సామాజిక శ్రేయాన్నిసైతం ప్రసాదిస్తాయి. ఈ నియమాల అర్థాలు ప్రయోజనాలు ఇప్పుడు తెలియక పోయినా కాలాంతరంలో వానివలన ప్రయోజనం తెలిసి వస్తుంది. అందరూ ఆచారాలను విడిచిపెడితే అవి అంతరిస్తాయి. ఎవరో పదిమంది ఆచారవంతులై ఉంటే చాలదా? అంటే అందరూ యత్నించినపుడే పదిమందియైనా ఆచారసంపన్నులుగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచే ప్రతి ఒక్కడూ తన ఆచారాన్ని తాను రక్షించుకొంటూ ఇతరుల ధర్మాలను కూడా రక్షించడానికి యత్నించాలి.
ఆయా వర్ణాశ్రమాలవారు ఆయా వర్ణాశ్రమాచారాలను చక్కగా పాలించడంవల్ల వారివారి శ్రేయస్సులతో సామాజిక శ్రేయంకూడా ఫలిస్తుంది. ఆత్మజ్ఞానం కలిగినమీదట ఆచారానుష్ఠానాలు తామంతతామే తొలగిపోతాయి. జ్ఞానదశలో కట్టుబాట్లు ఏమీ ఉండవని మనుస్మృతి చెపుతోంది. అది జ్ఞానకాండకు చెందిన మాట.
ఆ మనుస్మృతియే కర్మకాండలో కర్మాచరణావశ్యకతను వివరించింది. ఆ స్మృతిగ్రంథంలో మనకు నచ్చిన విషయాలను అంగీకరించి, మనకు నచ్చని వానిని గూర్చి ఇవి ఎవరో మధ్య కాలంలో వ్రాసి యిందులో చేర్చేరు అనడం యుక్తమా! మనం ఎదుర్కొనజాలని అధర్మం లోకంలో ఆవిర్భవిస్తే ఆ అధర్మం అధర్మం కాదు, ధరమ్మే అని చెప్పడం తప్పు. మనం మన ధర్మాలను సాధ్యమైనంతవరకు రక్షించుకొనాలి. మానసికంగా చేసినప్పటికీ ధర్మం ధర్మమే, అధర్మము అధర్మమే అని నిశ్చయించుకొనాలి. అంటే మనస్సులోకూడ అధర్మాన్ని ఆచరించరాదు. ధర్మాచరణవిషయంలో యీ నిశ్చయబుద్ధి ఉంటే క్రమంగా అది మనచే సుష్ఠుగా పాలించబడుతుంది. ఆచార్యులవారి ఆదేశంకూడా ఇదే.
వ్యాసులవారు చెప్పినట్లు శంకరులు ముమ్మారు దిగ్విజయం చేసేరు. మూడు సార్లు భారతదేశంలో ప్రదక్షిణ క్రమంగా పర్యటించేరు. అలా పర్యటించే సమయంలో వెనుక చెప్పిన కాపాలికుని ఉదంతం సంఘటిల్లింది.
|